CSS Drop Down Menu

Saturday, December 6, 2014

"అదృష్టం,దురదృష్టం" అనేవి వ్యక్తుల "గుణగణాల"పైనే ఆధారపడి ఉంటాయా ?

 కొందరికి ఏ పని చేసినా కలిసొస్తుంది. ముట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ముళ్ళదారిలో నడిచినా పూలబాట దాటినంత సాఫీగా ప్రయాణం సాగిపోతుంది. మరికొందరికి అనుకున్నదేదీ జరగదు. ఏ పని చేసినా కష్టం, నష్టం తప్ప లాభం, సుఖం అన్నవి వాళ్ళకి తెలీదు. ఇందులో మొదటిరకం వాళ్ళని అదృష్టవంతులనీ, రెండోరకం వాళ్ళని దురదృష్టవంతులనీ అనేస్తాం. వాళ్ళ తలరాత అంతే అని కూడా అంటాం. అయితే నిజంగా అదృష్టం, దురదృష్టం అనేవి కొంతమంది దగ్గరే ‘ఫిక్స్‌డ్‌గా వుంటాయా అంటే కానేకాదు అంటున్నారు రిచర్డ్ వైజ్‌మెన్. అదృష్టం, దురదృష్టం అనేవి ఆయా వ్యక్తుల గుణగణాలపైనే ఆధారపడి వుంటాయని అంటున్నారు అయన.

అదృష్టం అనేది కొందరినే ఎందుకు వరిస్తుంది? అందరూ అదృష్టవంతులు ఎందుకు కాలేకపోతున్నారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలని అనుకున్నారు హెర్డ్ ఫోర్డ్ షైర్ విశ్వవిద్యాలయంలో సైకాలజిస్ట్‌గా పనిచేసే రిచర్డ్ వైజ్‌మెన్. తన పరిశోధన కోసం లండన్‌లోని అతి అదృష్టవంతులు, అతి దురదృష్టవంతుల్ని రమ్మని పత్రికల్లో ప్రకటనలిచ్చారు. అలా ఆ ప్రకటనలకి స్పందించి సుమారు 400 మందికి పైగా అదృష్టవంతులు, దురదృష్టవంతులుగా తమని తాము భావించే వారు రిచర్డ్‌ని కలిశారు. వారిని ఇంటర్వ్యూలు చేసి, వారిపై కొన్ని ప్రయోగాలు చేసి అదృష్టం, దురదృష్టాలు వ్యక్తుల గుణగణాలపై ఆధారపడతాయని కానీ, అవేం అదృశ్య శక్తులు కావని తేల్చారు రిచర్డ్.

రిచర్డ్ వైజ్‌మెన్ చేసిన కొన్ని ప్రయోగాలు ఎంతో ఆసక్తికరంగా సాగాయి. అందులో ఒకటి... ఒకరోజు రిచర్డ్ ఒకొక్కరికీ ఒక పత్రికని ఇచ్చి అందులో ఎన్ని  ఫొటోలు వున్నాయో చెప్పమన్నాడంట. అదృష్టవంతులు కొన్ని సెకన్లలో సమాధానం చెప్పేశారు. దురదృష్టవంతులు మాత్రం రెండు, మూడు నిమిషాల సమయం తీసుకున్నారట. ‘‘ఈ పత్రిక మొత్తంలో 43 ఫొటోలు ఉన్నాయి. ఇక లెక్కపెట్టడం ఆపేయండి’’ అని రెండో పేజీలో పెద్దపెద్ద అక్షరాలతో రాసుండటం దురదృష్టవంతులు గమనించక పోవడమే దీనికి కారణం. ఫొటోలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టాలన్న టెన్షన్‌లో వాళ్ళు మిగిలినదేదీ గమనించలేదు. అలాగే కొందరు దురదృష్టవంతులు దానిని చూసి కూడా నిజమని నమ్మలేకపోయారుట.
ఆ ప్రయోగంలో అదృష్టవంతులుగా భావించే వారు ఏ కంగారూ లేకుండా చూడ్డం వల్ల రెండో పేజీలో వున్నదాన్ని చూడగలిగారు.  దీనిని విశ్లేషిస్తూ రిచర్డ్ ఇలా అంటున్నారు... ‘‘అదృష్టవంతులకు ఉన్న వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణి, సమయస్ఫూర్తి, సానుకూల దృక్పథం, చురుకుగా స్పందించే గుణాల వల్లే వారు అన్నిటిలోనూ విజయాలు సాధించి అదృష్టవంతులుగా పిలువబడుతున్నారు. అదే దురదృష్టవంతుల విషయానికి వస్తే, వారిలో చొరవ లేకపోవటం, వచ్చిన అవకాశం వదులుకోవడం, ప్రతీ విషయాన్ని తమకి ప్రతికూలంగా భావిస్తూ వుంటారు’’ అన్నారు.
 కాబట్టి ‘‘నాకు అదృష్టం లేదు’’ అనే మాటలు వదిలి, అదృష్టం వరించాలంటే ఉండాల్సిన లక్షణాలను పెంపొందించుకోండి అంటున్నారు రిచర్డ్ వైజ్‌మెన్.

0 comments:

Post a Comment