CSS Drop Down Menu

Tuesday, December 2, 2014

"బేడీ" కి "మోడీ" మద్దతు ?

 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే కిరణ్ బేడీపై నమోదైవున్న చీటింగ్ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉపసంహరించుకున్నట్టు సమాచారం. 
 
కాగా, కిరణ్ బేడీపై ఉన్న చీటింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును తయారు చేసి కోర్టుకు సమర్పించారు. దాంతో ఆమె బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు మరింత ఊపువచ్చింది. పైగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పనిచేసిన కిరణ్ బేడీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ట్విట్టర్‌ ద్వారా మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. పీఎం మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వాగతించారు. దీంతో కిరణ్ బేడీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకుంది. 
 
అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న సమయంలో 2011 నవంబర్‌లో కిరణ్ బేడీపై కేసు నమోదు చేశారు. తన ట్రస్టులు ఇండియా విజన్ ఫౌండేషన్, నవజ్యోతి ఫౌండేషన్‌లకు మైక్రోసాఫ్ట్ విరాళంగా ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని కిరణ్ బేడీపై కేసు నమోదైంది. 
 
పోలీసు శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు ఆమె ఒక్కొక్కటి 20 వేల రూపాయల ఖరీదు చేసే కంప్యూటర్లను 50 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారనే ఆరోపణ కూడా ఉంది. దీంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని అప్పట్లో సిటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
తాము మైక్రోసాఫ్ట్ నుంచి వాంగ్మూలం తీసుకున్నామని, బేడీ ఏ విధమైన దుర్వినియోగానికి పాల్పడలేదని చెప్పిందని పోలీసులు తమ క్లోజర్ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు గత అక్టోబర్ 28వ తేదీన క్లోజర్ రిపోర్టును కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. 


0 comments:

Post a Comment