వారు
మాట్లాడే ఒక్కొక్క మాట ఆయన గుండెలు పిండేశాయి. వారు మాట్లాడుతుంటే తెలంగాణ
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఏడుపు తన్నుకొచ్చింది. అయినా
బిగబట్టుకున్నారు. ఆయనను అంతగా ఏడ్పించిన వారెవరు..? అంత ధైర్యం ఎవరికుంది
అనే అనుమానం వెంటనే కలుగుతుంది. ఇలా ఆయనను ఏడ్పించిన వారు ఇద్దరు అనాథ
పిల్లలు.. వారి తెలివితేటలు చూసి అబ్బురపడిన ఆయన మరుక్షణమే మేము అనాథలం అనే
మాట విని కేసీఆర్ తట్టుకోలేకపోయారు. వస్తున్న ఏడుపును నిలబెట్టుకున్నారు. ఈ
సంఘటనను మంగళవారం ఆయన స్వయంగా తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
గజ్వేలు నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి
వెళ్లారు. అక్కడో ఇద్దరు అమ్మాయిలు గణితంలో ఏది అడిగినా టకటకా
సమాధానాలిచ్చారు. అబాకస్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. కార్యక్రమం ముగిశాక
వాళ్లిద్దరూ కేసీఆర్ దగ్గరికొచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి,
‘సార్... మేము పదో తరగతి చదువుకుంటున్నాం. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు.
మేము అనాధలం. మాకెవరూ లేరు సార్..’ అన్నారు.
అనాధలం అనే మాట ఆ చిన్నారుల నోటి నుంచి
రావడంతో తనకు దుఃఖం వచ్చిందనీ, తన కళ్లల్లో నీళ్లు తిరిగాయనీ, బాగుండదని
ఏడుపు ఆపుకొన్నానని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పటికీ ఆ పిల్లలు నా కళ్లల్లో
మెదులుతున్నారు అనాధలమని చెప్పుకొనే స్థితి రావడం తన మనసును కలిచివేసిందని
సీఎం కె.చంద్రశేఖర్ రావు ఉద్వేగంగా మాట్లాడారు. మంగళవారం అనాధ పిల్లల
చదువు, వసతి తదితర అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
పదో తరగతి తర్వాత అనాధ పిల్లలకు
ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని అధికారులకు సీఎం సూచించారు.
మొదటి రెసిడెన్షియల్ స్కూల్‌ను యాదగిరిగుట్టలో ప్రారంభించాలని, ఈ స్కూల్
శంకుస్థాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి
చెప్పారు. అనాధ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే అంశాలను అధ్యయనం చేసేందుకు
నియమించిన మంత్రివర్గ ఉప సంఘం వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని
సూచించారు.
0 comments:
Post a Comment