ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు రమేష్ బాబు. బెంగుళూరులో మొదట
ఆయన ఓ ఆర్డినరీ బిజినెస్‌మేన్... కానీ ఎక్స్‌ట్రార్డినరీ సంపాదనతో
వార్తల్లోకెక్కాడు. హేర్ కటింగ్, సెలూన్ బిజినెస్ ఓపెన్ చేసి కోట్ల రూపాయలు
వెనకేశాడు. ఇప్పుడాయన కార్లు రెంట్‌కిచ్చే వ్యాపారం కూడా చేస్తున్నాడు.
అది కూడా ఒకటి రెండు మోడళ్ల కార్లతో కాదు... ఏకంగా 67 రకాల కార్లు ఈయన వద్ద
అద్దెకు దొరుకుతాయి. ఇక ఈయన తిరిగే కారేంటో తెలుసా ? రోల్స్ రాయిస్!!
అవును ప్రపంచంలోని కొంతమంది ధనవంతుల వద్ద వుండే ఖరీదైన కార్లలో ఇదీ ఒకటి. ఈ
కారే ఆయనకు ఎక్కడా లేని ప్రత్యేకతని తెచ్చిపెట్టింది. రోల్స్ రాయిస్ కారు
మెయింటెన్ చేస్తున్న బార్బర్‌గా రమేష్ బాబుని బయటి ప్రపంచానికి పరిచయం
చేసింది. బెంగుళూరులో రోల్స్ రాయిస్ కారు సొంతం చేసుకున్న అతికొద్ది మందిలో
రమేష్ బాబు కూడా ఒకరు. రూ. 3 కోట్ల ఖరీదైన ఈ కారులో రోజూ సెలూన్‌కి వచ్చే
రమేష్ బాబు క్లయింట్స్ రేంజ్ కూడా అదే రేంజ్‌లో వుంటుంది. అమీర్ ఖాన్,
సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ వంటివాళ్లు రమేష్ బాబు కస్టమర్స్. బార్బర్‌గా
సంపాదిస్తున్నది ఎక్కువే అయినప్పటికీ... అంతకన్నా ఎక్కువ ఇప్పుడు కార్ల
రెంట్ బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నాడు.
1989లో తన తండ్రి చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఈ సెలూన్ దుకాణం ఒక్కటే
ఆధారం. తండ్రి ఇచ్చిపోయిన ఆస్తి కూడా ఆ ఒక్కటే. ఆ దుకాణాన్ని రోజుకు రూ.
5లకు లీజుకిచ్చిన రమేష్ తల్లి... తాను వేరేవాళ్ల ఇళ్లలో పనిమనిషిగా
పనిచేసేది. 1994లో చదువు ఆపేసిన రమేష్... తన తండ్రి మిగిల్చిపోయిన
దుకాణాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎప్పటికైనా ఓ కారు కొనాలన్న
కల తీర్చుకున్న రమేష్ బాబు... మరో మూడేళ్లకు మారుతి ఓమ్ని కొని అద్దెకి
ఇవ్వడం మొదలుపెట్టాడు. అదే అతడి జీవితాన్ని మార్చేసింది. ఆ కారుని మొదట
ఇంటెక్స్ కంపెనీలో క్యాబ్‌గా నడిపిన రమేష్ బాబు కార్స్ రెంటల్ బిజినెస్
అమాంతం రెట్టింపయ్యింది. మరోవైపు తన సెలూన్ బిజినెస్ కూడా స్థానికంగా బిజీ
సెలూన్ అయ్యింది. ఇంకేం.. రెండు చేతుల సంపాదన రమేష్‌ని కోట్లకు పడగలెత్తేలా
చేసింది. రోల్స్ రాయిస్ కొన్నా... బార్బర్ వృత్తిని మాత్రం మానుకోలేదు.
రోల్స్ రాయిస్ కారులో వచ్చినా ఇప్పటికీ అదే రూ. 65లకు కటింగ్ చేసే రమేష్
తాను తన గతాన్ని ఎప్పటికీ మర్చిపోలేదని చెబుతున్నాడు. అంతేకాదు..
కస్టమర్‌కి ఎంత శ్రద్ధగా క్రాప్ చేస్తానో... అంతే జాగ్రత్తగా తన రోల్స్
రాయిస్‌ని డ్రైవ్ చేస్తానంటున్నాడు రమేష్ బాబు.
0 comments:
Post a Comment