CSS Drop Down Menu

Friday, June 5, 2015

మాజీ సీఎం మామిడి కాయలు కోయకుండా 24 మంది పోలీసుల కాపలా?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఎక్కడ మామిడి కాయలు కోసుకు తినేస్తారోనని.. ఏకంగా 24 మందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం కాపలా పెట్టింది. జితన్ రాం మాంఝీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాట్నాలోని 1, అన్నేమార్గ్ బంగ్లాలో అధికారికంగా నివాసం ఉండేవారు. ఆయన పదవి నుంచి దిగిపోయినా, ఆ భవంతిని మాత్రం ఖాళీ చెయ్యలేదు. ఆ భవనం ప్రాంగణంలో ఎన్నో మామిడి చెట్లు ఉన్నాయి. 
 
ఈ సీజనులో ఈ చెట్లు మంచి దిగుబడిని ఇచ్చాయి. ఈ మామిడి మంచి రుచిగా ఉండటంతో బీహార్ రాజకీయ నేతలు తమకు కాయలు కావాలని సిఫార్సులు చేస్తుంటారు. మాంఝీ, ఆయన అనుచరులు ఎక్కడ కాయలు కోసేస్తారోనని 8 మంది ఎస్ఐలు, 16 మంది కానిస్టేబుళ్లు రేయింబవళ్లు ఆ చెట్లకు కాపలా కాస్తున్నారని తెలుస్తోంది. 
 
మాజీ ముఖ్యమంత్రి ఇంట పోలీసులను కాపలా పెట్టడంపై మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవ్వామ్ మోర్చా పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇది ఓ దళిత నేతను అవమానించడమేనని వ్యాఖ్యానించింది. తన ఇంటికి ఎందరో పేదలు నిత్యమూ వస్తుంటారని, వారికి కనీసం మామిడి కాయలు తినేందుకు కూడా అర్హత లేదని నితీష్ ప్రభుత్వం భావిస్తోందని మాంఝీ విమర్శించారు.

0 comments:

Post a Comment