రాజేంద్ర ప్రసాద్ మరో వైవిధ్యమైన పాత్రలో ‘దాగుడుమూతల దండాకోర్' లో
తెరమీదకు రానున్నాడు. ఇందులో ఈయనదే ప్రధాన పాత్ర. ఊరి పెద్ద. ఈయనతో సరిసమాన
ప్రాధాన్యత గల పాత్ర చిన్నారి సారా(నాన్నలో నటించింది)ది. ఈ చిత్రానికి
క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథాంశం శైవం అనే తమిళ సినిమా నుంచి
తీసుకున్నారు. శైవంలో నాజర్ చేసిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్
చేస్తున్నాడు.
కథ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ ది చాలా పెద్ద కుటుంబం.
ముగ్గురుకుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరూ సెలవులకు తప్పనిసరిగా తమ
సొంతూరు చేరుకుంటారు. అక్కడ తమ దేవతను దర్శించుకునే ఆచారాన్ని వారు
పాటిస్తారు. కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసినప్పుడు దేవతకు కోడిపుంజును బలి
ఇచ్చే ఆచారం ఆ ఊర్లో ఉంటుంది. అయితే రాజేంద్రప్రసాద్ మనవరాలు సారాకు
కోడిపుంజును బలి చంపడం అనే కార్యక్రమం నచ్చదు. కోడిపుంజును బలి ఇచ్చే తంతు
జరపడానికి వారు సిద్ధపడుతుండగా దాన్ని ఆ పిల్ల దాచిపెట్టడం, దానికోసం
కుటుంబమంతా గాలించడం... సినిమాలో ఎక్కువ భాగం ఇదే నడుస్తుంది.
ఆ పాపకు ఆ పుంజంటే ప్రాణం... అమాయకంగా తను ఆ పుంజుకోసం పడే తపనే చివరి
ట్విస్ట్. ఈ సినిమా చూసి తమిళనాడులోని కొన్ని గ్రామాలు పుంజును బలివ్వడం
అనే ఆచారాన్ని వదిలిపెట్టేశారట. అంతే కాదు కొన్ని గ్రామాల్లో కోళ్లు తినడం
మానేశారట. ఈ సినిమా ఇంతలా ప్రభావితం చేసిందంటే.... ఎంత హార్ట్ టచింగ్ గా ఈ
సినిమాను తీసుంటారో, ఇట్టే అర్థమై పోతుంది... మరి తెలుగు సినిమా
ప్రేక్షకులను ఈ సినిమా ఎంతలా ఆకట్టుకోగలదో వేచి చూడాల్సిందే.
0 comments:
Post a Comment