CSS Drop Down Menu

Monday, January 12, 2015

సూర్యు'డి' నుండి ఉచితంగా పొందండి ?


సూర్యకాంతిలో వుండే బి-బ్యాండ్ అతినీలలోహిత కిరణాలు మన ఆరోగ్యానికి అత్యంత కీలకమైనవి. ఆ కిరణాలే మన శరీరంలో ఎముకల పుష్టికి మూలమైన ‘విటమిన్-డి’ తయారీని ప్రేరేపిస్తాయట. ఆ కిరణాలు సూర్యకాంతి మన చర్మం మీద ఏటవాలుగా పడే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వుంటాయి. కాబట్టి వీటికోసం మనం ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ఆరుబయట గడపటం తప్పనిసరి. ఈ కిరణాలు మన చర్మం మీద పడుతూనే మన శరీరం ‘విటమిన్-డి ’ని తయారుచేసుకోవడం ప్రారంభిస్తుంది. మనం తిన్న ఆహారంలోని కాల్షియం ఎముకల్లో చేరడానికి డి విటమిన్ చాలా అవసరం.

 ‘విటమిన్-డి ’ కోసం మందులు వాడచ్చు కదా అంటారు కొందరు. కానీ, మనం వాడే మందుల్లో ‘విటమిన్-డి ’ సుమారు 100 యూనిట్ల లోపే వుంటుంది. నిజానికి ఒక్కరోజుకి పిల్లలకి 200 యూనిట్లు, పెద్దలకు 400 యూనిట్ల ‘విటమిన్-డి ’ అవసరం. ఆ లెక్కన ఎన్ని మందులు వాడాలి చెప్పండి. చక్కగా ఉదయం, సాయంత్రం లేలేత కిరణాలు తాకేలా నిలుచుంటేచాలు. రోజూ ఒంటికి సూర్యరశ్మి తగలని వారికి రొమ్ము, ప్రొస్టేట్, గర్భాశయం వంటి అవయవాలకు కేన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుందని పరిశోధకులు గుర్తించారు. పైగా ఈ మధ్యాకాలంలో చాలమందిలో ‘విటమిన్-డి ’ లోపం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు కూడా. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఈ ‘విటమిన్-డి ’ ఎంతో అవసరం. అయితే ఉదయం స్కూలుకి వెళ్ళే హడావిడి, సాయంత్రం ఎప్పుడో పొద్దుపోయాక ఇళ్ళకి చేరడం వల్ల తగినంత సూర్యరశ్మి పిల్లలకి చేరడం లేదని చెబుతున్నారు పరిశోధకులు. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా వుందట.

 సూర్యరశ్మి తగలగానే మన ఒంట్లో ‘మెలటోనిన్’ అనే హార్మోను తగ్గిపోతుందట. ఈ హార్మోన్ స్థాయి ఎక్కువగా వుంటే మనలో డిప్రెషన్ సమస్య ఎక్కువగా ఉంటుందిట. మానసికంగా నిస్తేజంగా ఉన్నా, డిప్రెషన్ చుట్టుముట్టినా లేలేత సూర్యకిరణాలలో సేదతీరడం మొదలుపెడితే చాలట. లేలేత సూర్యకిరణాలలో కొద్దిసేపు ఉంటే డిప్రెషన్‌కి కారణమైన ‘మెలటోనిన్’ హార్మోను స్థాయి తగ్గిపోతుంది. మానసికంగా ఉత్తేజం లభిస్తుంది. అంతేకాదు.. రోజు క్రమం తప్పకుండా వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలని సూర్య కిరణాలు తాకేలా చేసేవారు ఒత్తిడి బారిన పడే అవకాశాలు చాలా తక్కువట. వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాల వల్ల మాత్రమే కాదు.. ఆ సూర్యరశ్మి తాలూకు ప్రభావం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంతో ఉండచ్చని గట్టిగా చెబుతున్నారు.

 పసిపిల్లలు రాత్రంతా నిద్రపోకుండా అదేపనిగా ఏడుస్తుంటే రోజూ కొద్దిసేపు పగటి వెలుగులో ఉంచితే వారి నిద్ర అలవాట్లు తప్పకుండా మారతాయిట. అంతేకాక వారు ఉత్తేజంగా కూడా ఉంటారని అధ్యయనాల్లో తేలింది. అటు ఆధునిక వైద్యులు, ఇటు సంప్రదాయ వైద్యులు ముక్తకంఠంతో చెబుతున్న మాట ఒక్కటే. మన మెదడుపై సూర్యరశ్మి అమోఘమైన ప్రభావాన్ని చూపిస్తుందిట. ఇది నిద్రతోపాటు రకరకాల హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుందిట. కాబట్టి మన శరీరంలోని అంతర్గత గడియారం సజావుగా నడుస్తూండాలంటే రోజూ కొంత సమయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం అవసరం. సూర్యకిరణాలు సైతం మనల్ని తాకే అవకాశం లేని కాంక్రీట్ జంగిల్‌లో నివసిస్తున్నాం. ఆరుబయట ఉచితంగా, అనంతంగా దొరికే ఆరోగ్య ప్రదాయినిని నిర్లక్ష్యం చేస్తున్నాం. అనారోగ్యాన్ని కోరి తెచ్చుకుంటున్నాం అంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలపై ఇకనైనా కాస్త శ్రద్ధ పెట్టాలి. సూర్యకిరణాల స్పర్శతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే విషయమై ఆలోచించాలి.

 

0 comments:

Post a Comment