CSS Drop Down Menu

Wednesday, September 24, 2014

"పోలీసుల్ని"కాపాడిన "క్రిమినల్"

వారందరూ ఏదో ఒక నేరం చేసి పోలీసులకు చిక్కి జైలుపాలైన నేరస్తులు. అయితే జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల చోటు చేసుకున్న భారీ వరదలు వారిలోని మంచితనాన్ని, మానవత్వాన్ని బయటికి తీశాయి. ఇటీవలి వరదల్లో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోవడమేగాక వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఈ నేపథ్యంలో కరుడుగట్టిన నేరస్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరదల్లో కొట్టుకుపోతున్న పలువురు పోలీసులను కాపాడారు. వరదలు వచ్చే ముందు పరారు కావాలనుకున్న ఓ దొంగ.. తన మనసు మార్చుకుని ప్రజలకు సహాయసహకారాలను అందిస్తున్న పోలీసులతోపాటు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. తన వృత్తిలో నేర్చుకున్న నైపుణ్యాన్ని ఓ ఇంట్లో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించేందుకు ఉపయోగించాడు.
వరదల్లో షాహీద్‌గంజ్‌లోని పోలీస్‌స్టేషన్ దాదాపు నీటిలో మునిగిపోయింది. దీంతో నాలుగు రోజులపాటు పోలీసులు, నేరస్తులు ఆ పోలీస్ స్టేషన్ భవనంపైనే ఉన్నారు. పయాజ్ అనే నేరస్తుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరద నీటిలో కొట్టుకుపోతున్న పలువురు పోలీసులను రక్షించాడని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
వరదనీటిలో చిక్కుకున్న ఓ ఇంట్లోని కుటుంబసభ్యులను ఓ దొంగ తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఆ ఇంట్లోకి ఓ తాడును పంపించి చెక్క సహాయం వారిని కాపాడాడు. మరో నేరస్తుడు ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్న పోలీసుల బృందంలో చేరి రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. గ్రేనడ్స్ కలిగి ఉండటంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వరదల సమయంలో అతడు పోలీసులకు సహాయం చేయడంతోపాటు వారికి తన ఇంటి నుంచి టీ తెప్పించి అందించాడు. ఇదంతా చూస్తుంటే.. కష్టకాలంలో మనుషుల్లో ఉన్న మంచితనం బయపడుతుందని తెలుస్తోంది కదూ!


0 comments:

Post a Comment