పాపం...కేంద్రమంత్రి చిరంజీవికి సొంతూర్లోనే చుక్కెదురైంది. పట్టుమని వందమంది కేడర్ కూడా ఆయన వెంట లేని పరిస్థితి ఎదురైంది.అలాంటివారికి పార్టీ టిక్కెట్లు కేటాయించినందుకు చిరు తలదించుకోవాల్సి వచ్చింది. దీంతో ఒంగోలులో తన ఎన్నికల ప్రచారాన్ని కాన్సిల్ చేసుకుని బిచానా ఎత్తేశారు చిరంజీవి. అసలు విషయానికి వస్తే...ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన చిరంజీవి... అందులో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రచారానికి విచ్చేశారు.చిరంజీవి చిన్నప్పుడు ఇక్కడే చదువుకోవడంతో ఆయనకు చాలామందితో ఇక్కడ సంబంధాలున్నాయి. చాలా సందర్భాల్లో కూడా ఒంగోలే తన సొంతూరుగా ప్రస్తావించారు కూడా. అయితే, ఎన్నికల ప్రచారానికి వచ్చిన చిరంజీవికి అక్కడ ఆయన పరివారం మినహా కాంగ్రెస్ కార్యకర్తలు అసలు కనిపించలేదు. అంతేనా ఆయనకు సపర్యలు చేసే వారు సైతం కరువయ్యారు. మొత్తం 12నియోజకవర్గాలుండే జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మితో పాటు కేవలం ఐదుగురు మాత్రమే చిరంజీవిని కలవడం... మిగతా ఏడుమంది మొహం చాటేయడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో అభ్యర్థికి కనీసం వందమంది కార్యకర్తలు కూడా లేరా? అంటూ మండిపడ్డారు. ఇలాంటివారికి పార్టీ టిక్కెట్లు ఎలా కేటాయించాల్సి వచ్చిందా? అంటూ తలపట్టుకున్నారు చిరంజీవి. వెంటనే అక్కడినుంచి బిచానా ఎత్తేసి నెల్లూరుకు వెళ్లిపోయారు. సినీరంగంలో ఒకవెలుగు వెలిగిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత చిరంజీవి గారి ఇమేజ్ ఇంతలా దిగజారి పోతేపోయింది, ఎక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా పూలు జల్లటం లేదుగాని చెప్పులు, కోడిగుడ్లు విసురుతుండటంతో ఎలాంటివాడు ఇలా అయిపోయాడని ఎవరు తీసుకున్నగోతిలో వారే పడతారంటే ఇదేనని అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. పాపం ! చిరంజీవి ?
0 comments:
Post a Comment