CSS Drop Down Menu

Thursday, May 12, 2016

ఆ హోటల్‌లో "తిండిని వేస్ట్ చేస్తే ఫైన్" వేస్తారు ?



ఇంటి దగ్గరేమో గానీ, బయట హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, ఆ మాట కొస్తే రోడ్డుపై ఏ బండి వైద్దెనా మీల్స్, చిరుతిండి ఇలా ఏది తిన్నా అందులో ఎంతో కొంత ఆహారాన్ని వృథా చేయడం మనకు పరిపాటే. అవసరం ఉన్నా, లేకున్నా ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేయడం, చట్నీ, కర్రీ వంటి వాటిని ఎక్కువగా తెప్పించుకుని, ఆపైన వాటిలో ఎంతో కొంత వదిలి పెట్టడం ఎక్కడైనా జరుగుతుండేదే. అయితే దీన్ని గురించి ఎవరూ ఆలోచించరు. ఎంతో విలువైన ఆహారం వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోరు. ఈ క్రమంలో ముంబైలో ఉండే ఆ హోటల్ యాజమాన్యం ఇలాంటి ఆహారపు వృథాను అరికట్టేందుకు ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.

ముంబైలోని మాతుంగా అనే హోటల్ వారు ఆహారం వృథా చేసిన కస్టమర్లకు ఫైన్ వేస్తున్నారు. అయితే వారు అన్ని పదార్థాలపై మాత్రం ఫైన్ వేయడం లేదు. కేవలం సాంబార్, రసం వరకు మాత్రమే దీన్ని పరిమితం చేశారు. ఆ హోటల్‌లో ఎవరైనా కస్టమర్ సాంబార్ లేదా రసంను మిగిలిస్తే చాలు వారిపై రూ.13 జరిమానా పడుతుంది. బిల్‌తోపాటు ఆ రూ.13లను కూడా కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. రోజు రోజుకీ పెరిగిపోతున్న పప్పులు, ఇతర ఆహార పదార్థాల ధరలను దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎవరూ వృథా చేయరాదని భావించే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ హోటల్ యజమానులు తెలుపుతున్నారు. అవును మరి, ఎంతో విలువైన ఆహారాన్ని వృథా చేస్తే ఆ మాత్రం ఫైన్ పడాల్సిందే! లేదంటే, అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ ఎక్కువ ఆర్డర్ ఇచ్చి ఫుడ్‌ను అనవసరంగా వేస్ట్ చేస్తారు కదా!

ఇంతకీ ఇలా ఫైన్ వేస్తే కస్టమర్లు ఊరుకుంటారా? అనేదే మీ ప్రశ్న కదూ! అయితే ఆ హోటల్ అనుసరిస్తున్న ఈ పద్ధతికి కస్టమర్లు మొదట్లో విసుక్కున్నారట! అయితే క్రమంగా వారు దానికి అలవాటు పడిపోయారట. ఈ క్రమంలో వీలైనంత వరకు తమకు సరిపడా ఆహారాన్నే ఆర్డర్ ఇచ్చి మరీ తింటున్నారు. నిజంగా ఐడియా అంటే అదీ! ఇదే ఐడియాను దేశంలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్స్‌లో పాటిస్తే ఎంత బాగుంటుందో కదా! అప్పుడు ఇంకా ఎక్కువ ఆహారం వృథా కాకుండా చూడవచ్చు. అంతేకాదు పార్టీలు, డిన్నర్‌లకు కూడా దీన్ని వర్తింపజేస్తే సరి! ఆహారం దొరక్క అలమటిస్తున్న ఎంతో మందికి ఈ విధానం ద్వారా ఆహారాన్ని అందించేందుకు వీలు కలుగుతుంది.

0 comments:

Post a Comment