CSS Drop Down Menu

Monday, July 11, 2016

ఆరోగ్యం కావాలంటే ఆహారంలో " మైదా"ను దూరం పెట్టండి !

ఒకప్పుడు దక్షిణాది భారతీయులకి మైదా అంటే ఏమిటో తెలియదు. బియ్యం లేదా గోధమపిండితోనే వారి జీవనశైలి ముడిపడి ఉండేది. కానీ ఇప్పుడో! బేకరీల దగ్గర నుంచీ పరాఠా హోటళ్ల దాకా మైదాదే ప్రపంచం. కానీ ఆహార నిపుణులు మాత్రం ఈ మైదాని స్లో పాయిజన్‌గా గుర్తిస్తున్నారు. వీలైనంతగా మైదాకు దూరంగా ఉండమంటూ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే...

  గోధుమ గింజల్లో ఉండే పిండి పదార్థాలను వేరు చేస్తే అదే మైదాగా మారుతుంది. నిజానికి మైదా రంగు తెలుపు కాదు- పసుపు. పసుపు రంగులో ఉండే మైదాకు తెల్లటి తెలుపుని ఇచ్చేందుకు Benzoic peroxide అనే రసాయనాన్ని కలుపుతారు. ఇక మెత్తగా ఉండేందుకు alloxan అనే రసాయనాన్నీ వాడతారు. ఆహారంలో ఇలాంటి కృత్రిమ రసాయనాలు చేరిక ఏమంత ఆరోగ్యం కాదని వేరే చెప్పనవసరం లేదు కదా!

 మైదాలో GI (glycaemic index) చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దీనిని తిన్నవెంటనే చాలా అధికంగా, చాలా త్వరగా చక్కెరను ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇలా త్వరగా ఉత్పత్తి అయిన చక్కెరను నియంత్రించేందుకు మన శరీరం ఇన్సులిన్‌ ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుంది. తరచూ మైదాని తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి, తద్వారా పాంక్రియాస్‌ పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇదే కనుక జరిగితే చక్కెర వ్యాధి బారిన పడక తప్పదు.

  మైదాలో పిండిపదార్థాలే కానీ పీచుపదార్థాలు కనిపించవు. మనం తిన్న ఆహారం సవ్యంగా జీర్ణం కావాలంటే, అందులో ఎంతో కొంత పీచుపదార్థం తప్పనిసరిగా ఉండితీరాలి. లేకపోతే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పేగుల్లో పుండు మొదలుకొని మొలల వ్యాధి వరకూ నానారకాల రోగాలు దాడిచేసే ప్రమాదం మైదా కలిగిస్తోంది.

  మైదాలో ఉండే పోషకాల పట్టికను చూస్తే గుండె తరుక్కుపోక తప్పదు. అందులో పిండిపదార్థాలు తప్ప విటమిన్లు కనిపించవు. ఇక ఖనిజాలు, ప్రొటీన్ల శాతమూ అంతంతమాత్రమే! అంటే మైదాతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం తప్ప మరేదీ మిగలదన్నమాట.

  మైదాలో gliadin అనే పదార్థం ఉంటుంది. ఇది ఆకలిని తాత్కాలికంగా పెంచుతుందని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. అంటే ఒక పరాఠా తిన్నవాడు వెంటనే మరో పరాఠా కోసం సిద్ధపడిపోతాడన్నమాట. అసలు మైదాలో ఉండేదే పిండిపదార్థాలు! ఇక ఈ పిండిపదార్థాలను రెట్టింపుగా తీసుకునేలా చేయడం వల్ల మైదా ఊబకాయానికి దారితీస్తోంది.

  ఇప్పుడు ఏ సందు చివర చూసినా బేకరీలే కనిపిస్తున్నాయి. బేకరీ పదార్థాలలో మైదాదే ముఖ్యపాత్ర. పఫ్‌ దగ్గర నుంచి బ్రెడ్ వరకూ మైదా లేనిదే బేకరీలో పని జరగదు. ఇక ఈ మైదాకి తోడు అజినమోటో, MSG వంటి పదార్థాలు కలిస్తే ఇక చెప్పేదేముంది. అనారోగ్యాన్ని టోకుని ఆహారం ద్వారా తీసుకున్నట్లు అవుతుంది.

అసటే మన ఆహారంలో పిండిపదార్థాల శాతం ఎక్కువ. బియ్యం, స్వీట్లు, దుంపలు... వంటి ఆహారాన్ని మనం అధికంగా తీసుకుంటూ ఉంటాము. ఇక వీటికి తోడు ఇప్పుడు బేకరీ చిరుతిళ్లు, పరాఠాలు, పూరీలు, చపాతీలు... అన్నీ కూడా మైదాతోనే తయారవుతున్నాయి. కాబట్టి మైదా పదార్థాల జోలికి పోయేముందు కాస్త నిదానించి, మంచీ చెడూ బేరీజు వేసుకుని అడుగు ముందుకు వేయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

0 comments:

Post a Comment