CSS Drop Down Menu

Tuesday, July 19, 2016

"ఒక్క ద్రాక్ష పండు" ఖరీదు "25 వేలు"!

జపాన్‌లో అత్యంత అరుదుగా లభించే రూబీ రోమన్ రకానికి చెందిన ద్రాక్షపండ్ల ఖరీదు గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఒక్క ద్రాక్ష పండు ఖరీదు ఎంతో తెలుసా...? అక్షరాల మన కరెన్సీలో రూ.25 వేలు ఉంటుంది. ఇది పండ్ల ధరా లేక షాపు మొత్తం ధరనా అని అనిపించకమానదు. సాధారణంగా ఒక కేజీ ద్రాక్ష దాదాపు రూ.100 అంటేనే కొనడానికి ఆలోచిస్తుంటాం.




అలాంటిది గుత్తిలో ఒక పండుని అంత ధర పెట్టి ఎవరు కొనుక్కుంటారు అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ఖరీదైన, అరుదైన పండ్లను కొనుగోలు చేయడానికి జపాన్ వాసులు క్యూ కడుతున్నారు. ఇది వారికున్న హోదాగా జపనీస్ భావిస్తుంటారు. అందుకని, అటువంటి పండ్లు చకచకా అమ్ముడు పోతున్నాయి. ఇలాంటి పండ్లను విక్రయించే దుకాణాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
 
కోనిషి అనే పండ్ల దుకాణదారుడు అరుదైన రూబీ రోమన్ రకపు ద్రాక్ష గుత్తిని 1.1 మిలియన్ యెన్లు అంటే మన కరెన్సీలో సుమారు 7.35 లక్షలకు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడు. అయితే ఈ గుత్తిలో ఉన్నవి కేవలం 30 ద్రాక్ష పండ్లు మాత్రమే. అంటే ఒక్క ద్రాక్ష ఖరీదు మన లెక్కలో పాతికవేలన్నమాట. రూబీ రోమన్ ద్రాక్ష ప్రత్యేకత ఏంటంటే... ప్రత్యేక పరిస్థితుల్లో, పలు నూతన పద్ధతుల్లో ఈ పంటను సాగుబడి చేస్తుంటారు. చక్కెర 18 శాతం వరకు ఉండే ఒక్కో ద్రాక్ష పండు 20 గ్రాముల వరకు బరువు తూగుతుంది. 1992 నుంచి జపాన్ తీరప్రాంతం ఇషికవలో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. 
 
2008 నుంచి వినియోగంలోకి వచ్చిన ఈ పండ్ల ధర ఏటికేడాది పెరుగుతూ పోతోంది. ఈ ద్రాక్షకు ఎంత డిమాండంటే ఒక్కోసారి వేలం పాట కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా నిర్వహించిన వేలం పాటలోనే కోనిషి ఈ అరుదైన ద్రాక్ష గుత్తిని అంత రేటు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. తాజాగా జరిగిన వేలంలో అత్యధిక ధరతో ఈ సీజన్‌ తొలిపంటకు చెందిన పండ్లను సొంతం చేసుకుని కోనిషి మరో సరికొత్త రికార్డును సృష్టించాడు. 
 

0 comments:

Post a Comment