CSS Drop Down Menu

Wednesday, August 31, 2016

చనిపోయేందుకు పార్టీ ?

మరణం అనే మాట అంటే చావు భయం. చనిపోతామని తెలిస్తే ఇంకేముంది... అంతా అయిపోయింది అని గుండె చెరువయ్యేలా ఏడుస్తారు. కానీ ఓ మహిళ ఇందుకు భిన్నంగా ప్రవర్తించింది. తను ఇక ఎన్నో రోజులు బ్రతకనని తెలుసుకున్న ఆ మహిళ తన చావు బాధాకరంగా ఉండకూడదని, చాలా సంతోషకరమైన ముగింపు కావాలని కోరుకుంది. దాంతో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తన స్నేహితులందరికీ ఆహ్వానాలు పంపింది. 
 
ఆమె పేరు బెట్సీ డావిస్. 41 ఏళ్ల వయసున్న ఆమె రంగస్థల నటి, చిత్రకారిణి కూడా. ఆమె ప్రాణాంతక వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. మరో 6 నెలలకు మించి బ్రతకవని ఆమెకు స్పష్టం చేశారు. ఆ మాట విన్న బెట్సీ కుంగిపోలేదు. తిన్నగా ఇంటికి వెళ్లింది. ఓ ఆలోచనకు వచ్చి తనకు బాగా ఆప్తులైన లిస్టును తయారుచేసుకుంది. తను ఓ పార్టీ ఆరేంజ్ చేయబోతున్నాననీ, ఆ పార్టీ అన్ని పార్టీల మాదిరిగా ఉండకపోవచ్చనీ, కాబట్టి మనసు స్థిరత్వం, దృఢంగా ఉండేవారు మాత్రమే రావాలనీ, చివరికి ఏం జరిగినా ఎవ్వరూ బాధపడకూడదనీ, అలా బాధపడతామేమోనని అనుకునేవారు తన పార్టీకి రావద్దని తెలిపింది. 
 
'మనసులోని మాటలు పంచుకోవడం, డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం, ప్రార్థనలు చేయడం, ఇష్టమైన ఆహారపదార్థాలు, ఆల్కహాల్ నచ్చినంత పుచ్చుకుని హాయిగా గడపాలి, ఎవరూ ఏడవకూడదు' వంటి షరతులు విధించింది. ఆమె కండిషన్లు చూసి కొందరు వెళ్లకపోయినా 90 శాతానికి పైగా హాజరయ్యారు. రెండు రోజులపాటు ఆమె తన స్నేహితులతో పార్టీలో హాయిగా గడిపింది. 
 
ఆ ఆనందం ఇక చాలని భావించి, విందు తరువాత ఎక్కువ మోతాదులో మందులు వేసుకుని శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో జూలై నెలలో జరిగింది. "తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆరు నెలలకు మించి బతికే అవకాశం లేనివారు యుక్తవయస్కులై ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఆత్మహత్య చేసుకోవచ్చు" అనే కొత్త చట్టం కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకువచ్చింది. ఈ చట్టం రాగానే ఇలా ఆత్మహత్య చేసుకున్న తొలి మహిళగా బెస్టీ నిలిచింది.
 


0 comments:

Post a Comment