CSS Drop Down Menu

Monday, April 18, 2016

"అరేబియా సముద్రం" లో అద్భుత శివాలయం !

ఇంతవరకు మీరు ఆలయాలను కొండల మీద, గుట్టల మీద, నదులు - సముద్రాల ఒడ్డున, ఊరి మధ్యలో ... పర్వతాల్లో, గుహాల్లో చూసి ఉంటారు అవునా ? ఈ ప్రదేశాల్లో కాకుండా, ఇంకా ఎక్కడైనా మీరు ఆలయాలను చూశారా ? ఊహించండి ... ఇంకా ఏదైనా ప్రదేశం మీ బుర్రకు తట్టవచ్చేమో ..? (లేదు కదూ ..!)
సముద్రం లోపల ఊహించారా ? అవునండీ .. సముద్రం లోపలే ? ఏం ఆశ్చర్యపోతున్నారా ? నిజమండీ బాబోయ్ .. సముద్రం లోపల ఆలయం ఉంది. అదెక్కడో కాదు .. మన భారతదేశంలోనే ... అరేబియా సముద్రం లోపల ఉందండీ. ఇక్కడికి వెళితే రాగలమో ?లేమో ? అనేగా మీ సందేశం. అయితే దీని గురించి మీకు చెప్పాల్సిందే .. !
గుజరాత్ లోని భావ్ నగర్ నగరానికి సమీపాన ఉన్న కొలియాక్ అనే గ్రామంలో సముద్రం నుండి 1. 5 కిలోమీటర్ల లోపల ఉన్నది.
ఇక్కడ చెప్పబడుతున్న ఆలయం శివునికి అంకితం చేయబడినది. ఇందులో శివలింగం ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రధాన దైవం. ఈ గొప్ప శివలింగం అరేబియా సముద్రంలో ఉంటుంది.


ఆలయానికి ఏ టైమ్ అంటే ఆ టైమ్ లో వెళ్ళకూడదు. దీనికంటూ ఒక సమయం ఉంది. ఉదయాన్నే లేచి అక్కడికి వెళితే కనపడదు ఈ ఆలయం.ఒకవేళ మీరు వెళ్లారే అనుకోండి ... అక్కడ మీకు ఆలయం కనిపించదు ... దూరంలో సముద్రంలో నిలబడి ఉన్న ద్వజస్తంభం కనిపిస్తుంది.

మధ్యాహ్నం పూట వెళితే మీరు ఆలయాన్ని చూడవచ్చు. ఆ సమయంలో సముద్రం మెల్లగా వెనక్కి వెళుతుంది (మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో ఈ దృశ్యం కనిపిస్తుంది). అలా సముద్రం వెనక్కి వెళ్ళిన తరువాత మీరు ఆలయం వద్దకు తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్ళవచ్చు, ఆలయంలో పూజలు చేయవచ్చు.


ఇలా రాత్రి 10 గంటల వరకు మీరు అక్కడే .. ఆలయంలో హాయిగా గడపవచ్చు. ఆ సమయం దాటితే మాత్రం వెనక్కి వచ్చేయ్యాలి లేకుంటే సముద్రంలో కలిసిపోతారు. రాత్రి 10 దాటితే సముద్రం మళ్లీ ముందుకు వచ్చి గుడిని ముంచెత్తుతుంది. దాంతో గుడి కనిపించదు. ఇదీ ఇక్కడ జరిగే అద్భుత వింత.



ఆలయంలో ఎత్తుగా ఉండేది ద్వజస్తంభం. సుమారు ఆ లెవల్ వరకు (20 మీ) నీళ్ళు వచ్చేస్తాయి. ఇలాగా కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచి జరుగుతుందట.
ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెబుతుంది. పాండవులు పూజలు చేసి ప్రతిష్టించిన 5 శివలింగాలు ఇప్పటికీ ఆలయంలో చెక్కు చెదరకుండా ఉన్నాయి.
పౌర్ణమి లో ... చంద్రుని వెన్నల కాంతుల్లో ... సముద్రం ముందుకు వచ్చి, మెల్లగా తనలోకి గుడిని తీసుకుపోవడం అద్భుతంగా కనిపిస్తుంది. వీలైతే చూడండి. ఈ ఘట్టాన్ని తిలకిస్తున్నంత సేపు .. కళ్లుఆర్పకుండా చూస్తూ ఉండటమే ఇక్కడ కొసమెరుపు. చూస్తున్నంత సేపు ఇటువంటి అద్భుత దృశ్యం ప్రపంచంలో మరెక్కడా లేదేమో అనిపిస్తుంది.


ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా మీరు భావ్ నగర్ చేరుకోవాలి. భావ్ నగర్ నుండి బస్సుల్లో లేదా ఆటోల్లో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు. భావ్ నగర్ లో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి ముంబై, ఢిల్లీ, గాంధీనగర్, జైపూర్ వంటి అంగరాలకు రెగ్యులర్ గా విమానాలు నడుస్తుంటాయి.
 రైలు మార్గం భావ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా అహ్మదాబాద్, ఓఖా, వడోదర, ముంబై నగరాల నుండి ప్రతిరోజూ రైళ్లు నడుస్తుంటాయి. 
 రోడ్డు  బస్సు మార్గం భావ్ నగర్ వ్యాపార నగరం. సమీప పట్టణాల నుండి, సూరత్, రాజ్ కోట్, జామ్ నగర్ ప్రాంతాల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.

దీనికి సంబందించిన వీడియో చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి. 

 https://youtu.be/j3WHHA-MNe4




4 comments:

  1. అద్భుతం. వీలు కుదిరితే కొన్ని ఫోటోలు జత చేయగలరు.

    ReplyDelete
  2. వీడియో లింక్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసి చూడండి.

    ReplyDelete