CSS Drop Down Menu

Wednesday, July 9, 2014

"రుద్రాక్షల" యొక్క ఉపయోగాలు !!!



మన హిందువులలో "రుద్రాక్ష" పేరు విననివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే ఈ రుద్రాక్షలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమీటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్ లో మరియూ ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. ఈ వృక్షం పెరిగి పుష్పించి ఫలించటానికి కనీసం 15 నుండి 16 సంవత్సరాలు పడుతుంది. పురాణ కథ: "రుద్రాక్ష" అనే పదం రుద్ర + అక్ష అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు (కన్నీటి బొట్లు) అని అర్ధం.

రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో పోరాడి, మూడు పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్థం. రుద్రాక్షలను శివ రూపాలుగా భావించి పూజించడం ... ధరించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా శివారాధకులలో కొందరు రుద్రాక్షలను మాలగా ధరించగా, మరికొందరు కంఠం వరకు మాత్రమే ధరిస్తుంటారు. ఇంకొందరు ముంజేతికి ... భుజాలకి ధరిస్తుంటారు.

రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

రుద్రాక్షలలో వివిధ ముఖాలున్నవి మనకు లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు ఉన్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మాత్రమే ప్రస్తుతం లభ్యవుతున్నాయి. వీటిని మానవులు ధరిస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. వాటి వివరాలు, ఉపయోగాలు మీకోసం ...



ఏకముఖి రుద్రాక్ష: (ఒక ముఖము కలిగినది): అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా, శివుని ప్రతిరూపంగా నమ్ముతారు. ఇది దరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ది, సంపద చేకూరతాయి. సర్వతోముఖ అభివృద్ధి. అన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది.

ద్విముఖి (రెండు ముఖములు కలిగినది) దీనిని శివపార్వతి రూపంగా-అర్ధనారీస్వర తత్వానికి సంకేతంగా నమ్ముతారు. దీనిని ధరించడం వల్ల కుండలినీ శక్తి పెరుగుతుంది. సౌభాగ్య ప్రదాయని, సర్వపాపహారిణి. ఈ రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుంది. దుష్ట ఆలోచనలు అదుపుచేస్తుంది. వైవాహిక సంబంధాలను మెరుగు పరుస్తుంది.

త్రిముఖి (మూడు ముఖములు కలిగినది) దీనిని త్రిమూర్తి స్వరూపంగా, అగ్నికి సంకేతంగా నమ్ముతారు. దీనిని ధరిస్తే ఆరోగ్యానికి, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది. సకల సౌభాగ్య దాయని. తరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాదులనుండి ఉపశమనం

 చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది) నాలుగు వేదాల స్వరూపం. బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయం అవుతాయి. విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది. ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయని. మానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది. జ్ఞాపకశక్తి ని, తెలివితేటలను పెంపొందిస్తుంది. నరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది.

పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది) పంచభూత స్వరూపం. గుండె జబులున్న వారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది. కోపాన్ని అదుపుచేసి మనసుకు శాంతిని కలగ చేస్తుంది. రక్తపోటు, చక్కెర వ్యాధి, పంటి నొప్పులు మూల వంటి వ్యాదులను నివారిస్తుంది.

షట్ముఖి (ఆరు ముఖములు కలది) కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.కుడి చేతికి కట్టుకుంటే లోబిపి తగ్గుతుంది. బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందుతారు.

 సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది) కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. ధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది.

అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది) విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది. ప్రమాదాల నుండి, ఆపదల నుండి రక్షణ కల్పిస్తుంది.

నవముఖి (తొమ్మిది ముఖాలు కలది) నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి. ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది.

దశముఖి (పది ముఖాలు కలిగినది): దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. నరాలకు సంబంధించిన వ్యాధులకు, జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది.

 ఏకాదశముఖి: 11ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది.

ద్వాదశముఖి: 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది. రక్త, హృదయ సంబంధిత వ్యాధులకు మంచిది. ధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది

 త్రయోదశముఖి: కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది. అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది.

చతుర్ధశముఖి 14ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను. శని సంబంధిత సమస్యలకు మంచిది.


0 comments:

Post a Comment