నాటకీయ పరిణామాల నడుమ కన్నుమూసిన తమిళ దివంగత సీఎం జయలలిత మరణానికి సంబంధించి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే ఉంది. అపోలో వైద్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించిన ఒకరోజు ముందే ఆమె చనిపోయారని కొంతమంది వాదిస్తుంటే.. అసలు అమ్మ మరణానికి స్పష్టమైన కారణాలేంటో చెప్పాలని నటి గౌతమి లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమ్మ మరణానికి సంబంధించి ఓ ఆసక్తికర వాదనను కొంతమంది తెరపైకి తెచ్చారు. ఓ విగ్రహ ప్రతిష్టాపనకు అమ్మ మరణంతో లింకు పెట్టేశారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన వల్లే అమ్మ మరణించారంటూ ఇప్పుడు తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. దైవ సంబంధిత విషయాలకు అధిక ప్రాధాన్యతమిచ్చే కొంతమంది వ్యక్తులు.. ఇలాంటి ప్రచారానికి ఆస్కారం కల్పించారన్న వాదన కూడా లేకపోలేదు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. కాంచీపురం జిల్లాలోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధమైన ఏకాంబరనాథర్ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం ఉంది. కొన్నాళ్ల క్రితం ఇది ధ్వంసం కావడంతో.. దీని స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే ఆలయ కమిటీ ప్రతిపాదనల్ని తోసిపుచ్చుతూ..చిన్నపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని శిల్పులు చెప్పారు. అంతేకాదు మూల విరాట్టు విగ్రహాన్ని మార్చడం వల్ల రాష్ట్రాధినేత ప్రాణానికి గండం ఏర్పడుతుందని కూడా చెప్పారట. అయితే ఇవేవి పట్టించుకోని ఆలయ కమిటీ ఈ నెల 5న కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించింది. జయలలిత కూడా అదే రోజున కన్నుమూయడంతో.. అమ్మ మరణానికి విగ్రహ ప్రతిష్టాపనే కారణమంటూ కొంతమంది వాదించడం మొదలుపెట్టారు.
0 comments:
Post a Comment