మనం తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్స్ రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
దానిమ్మ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చని వైద్యులు చెపుతున్నారు.
డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. విటమిన్ సి కమలా పండులో పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల ప్రతి రోజుకు ఒక పండును తీసుకుంటే మచిందట. పైగా, ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుందన్న భయం అక్కర్లేదనీ, ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయులు తక్కువే.
జామ పండులో మధుమేహాన్ని నియంత్రించే గుణాలు ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. అందువల్ల జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.
వేసవికాలంలో విరివిగా లభించే పుచ్చకాయను కూడా తినొచ్చట. పుచ్చకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుందట. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్‌లో నరాలు దెబ్బతినడం కూడా దోహదపడుతుందట.
బొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది. అలాగే, నేరేడు పండ్లు మధుమేహాన్ని బాగా నియంత్రిస్తాయట. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుందట.
ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిదని వైద్యులు చెపుతున్నారు. అలాగే, యాపిల్‌లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్‌లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్‌ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.
0 comments:
Post a Comment