CSS Drop Down Menu

Wednesday, July 11, 2018

ఆ బిచ్చగాడు చేస్తున్న "పనుల"ను చూస్తే ఎవరైనా హేట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు !

ఓ బిచ్చగాడు దేవుడుకి కిరీటం చేయించాడు. దాని విలువ అక్షరాలా లక్ష రూపాయలు. అవును ఏ గుడి ముందు అయితే బిచ్చమెత్తాడో? ఏ దేవుడు అయితే ఇన్నాళ్లు ఏ కష్టం లేకుండా చూశాడో ఆ దేవుడికే తాను బిచ్చమెత్తగా వచ్చిన డబ్బుతో మొక్కు చెల్లించాడు.

నిజానికి బిచ్చగాడు అంటే ప్రతి ఒక్కరికీ లోకువే. సమాజం కూడా అతన్ని అతి చులకనగా, హేళనగా చూస్తుంది. కానీ, అతనిలో ఆవేదన, మానవత్వం మాత్రం ఎవరికీ పట్టదు. ఎవరు ఏమనుకున్నా.. ఎంత చీదరించుకుంటున్నా తన పని తాను చేసుకుంటూ పోతాడు. వచ్చిన డబ్బుతో నాలుగు మెతుకులు తింటాడు. ఏ బిచ్చగాడు అయినా చేసేపని ఇదే. 

కానీ, ఈ బిచ్చగాడు మాత్రం వారందరికీ భిన్నం. తనకు ఎలాంటి కష్టం లేకుండా చూసిన దేవుడుకి తాను భిక్షమెత్తగా వచ్చిన డబ్బుతో మొక్కు తీర్చుకున్నాడు. ఆ బిచ్చగాడు పేరు యాదిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నివాసి. ఈ ప్రాంతంలోని అనేక గుడుల ముందు కాషాయం ధరించి బిచ్చమెత్తుకుంటాడు. అలా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటాడు. మిగిలిన సొమ్మును దాచుకుంటాడు. 

అలా దాచిన సొమ్ము లక్ష రూపాయలు కాగానే గుళ్లకు దానం చేస్తాడు. మూడేళ్ల క్రితం లక్ష రూపాయలతో దత్తాత్రేయ స్వామికి వెండి పాదుకలు, తొడుకు చేయించాడు. యేడాది క్రితం ఓ ఆలయంలో అన్నదానం కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు సాయిబాబాకి లక్షా ఎనిమిది రూపాయలతో కిరీటం చేయించాడు. దీంతో ఆలయ కమిటీ యాదిరెడ్డిని ఘనంగా సన్మానించింది.



ఆలయాల ముందు భక్తులు ఇచ్చిన సొమ్ముతోనే ఈ ఆభరణాలు చేయిస్తున్నట్లు యాదిరెడ్డి తెలిపాడు. భక్తుల సొమ్ము ఆ స్వామికే చెందాలి అంటున్నాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టనని.. భక్తులు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను అంటున్నాడు. ఆ దేవుడే నాతో ఇవన్నీ చేయిస్తున్నాడని ఈ పరమ భక్త బిచ్చగాడు చెప్పుకొస్తున్నాడు. 

0 comments:

Post a Comment