CSS Drop Down Menu

Friday, May 20, 2016

ఈ రోడ్లపై పడిన నీరు "క్షణం"లోనే మాయమవుతుంది!

ఏ దేశంలోనైనా రోడ్లు ఎలా ఉంటాయి? ఎలా ఉండడమేటి, విదేశాల్లో అయితే రోడ్లు చాలా బాగుంటాయి. అక్కడ రోడ్లపై గుంతలను వెతకాలి. కానీ మన దగ్గరైతే గుంతల్లో రోడ్లను వెతకాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు, నాయకుల అవినీతి, నాణ్యతా ప్రమాణాల లోపం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, క్వాలిటీ లేని మెటీరియల్ వాడడం… ఇలా ఎన్నో కారణాల మూలంగా మన దగ్గర వేస్తున్న రోడ్లు కేవలం కొద్ది రోజులకే గుంతలు పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు వర్షం పడిందంటే చాలు ఇక ఆ గుంతల్లో పెద్ద ఎత్తున నీరు చేరుతుంది. దీంతో అలాంటి దారిపై ప్రయాణించాలంటేనే జంకాల్సి వస్తుంది. అయితే ఇంగ్లండ్‌లో ప్రస్తుతం నిర్మిస్తున్న రోడ్లు మాత్రం అదుర్స్ అనే రీతిలో ఉన్నాయి. ఎందుకంటే అవి అలాంటి ఇలాంటి రోడ్లు కావు. ఎన్ని వేల లీటర్ల నీటిని ఆ రోడ్లపై పోసినా కేవలం ఒకే నిమిషంలో ఆ నీరంతా రోడ్ల లోపలికి ఇంకి పోతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ!

permeable-concrete 

టార్మాక్ అనే పేరు గల సంస్థ టాప్‌మిక్స్ పెర్మియబుల్ కాంక్రీట్ అనే ఓ ప్రత్యేకమైన కాంక్రీట్‌ను తయారు చేసింది. దీంతో రోడ్డు వేస్తే చాలు, ఎంత నీరు ఆ రోడ్డుపై పడ్డా వెంటనే లోపలికి ఇంకిపోతుంది. అలా ఇంకిపోయిన నీటిని అవసరం అనుకుంటే ప్రత్యేక పైపుల ద్వారా దారి మళ్లించి నిల్వ చేసుకోవచ్చు. వాటిని శుద్ధి చేసి వినియోగించుకోవచ్చు. ఈ పెర్మియబుల్ కాంక్రీటు ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలో పడిన 1 వేయి లీటర్ల నీటిని కేవలం 1 నిమిషంలోనే లోపలికి గ్రహిస్తుంది. ఇంకో విశేషమేమిటంటే ఈ తరహా రోడ్ల నిర్మాణానికి వ్యయం కూడా తక్కువే అవుతుందట. అయితే ఈ కాంక్రీట్‌తో నిర్మించిన రోడ్లపై గంటకు 50 కిలోమీటర్ల వేగం కన్నా ఎక్కువ వెళితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందట. ఎక్కువ బరువున్న వాహనాలకు ఈ రోడ్లు అనువుగా ఉండవట. త్వరలోనే ఈ ఇబ్బందులను కూడా అధిగమించి కాంక్రీట్‌ను మరింత దృఢంగా తయారు చేస్తామని చెబుతోంది టార్మాక్ సంస్థ. మన దేశంలో కూడా ఇలాంటి రోడ్లు వేస్తే ఎంతో బాగుంటుంది కదూ, అప్పుడు వర్షం పడినా ఎంచక్కా రోడ్లపై నిర్భయంగా వెళ్లవచ్చు.

ఈ వీడియో గాని చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి . 




0 comments:

Post a Comment