CSS Drop Down Menu

Sunday, February 14, 2016

"మా అమ్మ నన్ను పురిట్లోనే చంపాలనుకుంది" అన్న గవర్నర్ ?

తన తల్లి తనను పురిట్లోనే చంపాలనుకుందని గోవా గవర్నర్‌ మృదుల సిన్హా అన్నారు. 40ఏళ్లకు గర్భం దాల్చడాన్ని అసాధారణంగా భావించిన తల్లి గర్భస్రావం కావడానికి మందులు తాగిందని, తండ్రి కలగజేసుకుని శ్రద్ధ వహించడంతో తాను పుట్టానని ఆమె చెప్పారు. గోవాలోని అనాన్సీ పాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ.. ఈ విషయం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘బేటీ బచావో బేటీ పఢావో' పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు తన జననం వెనక జరిగిన ఘటనలు గుర్తొచ్చాయన్నారు. సమాజం ఏమంటుందోనని చూడక తన తండ్రి ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి మంచి వైద్యం చేయించి తానీ లోకంలోకి రావడానికి కారకులయ్యారని మృదుల తెలిపారు.
అప్పట్లో ఆడపిల్లల్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులుఎదుర్కోవాల్సి వచ్చేదని, తండ్రి అవన్నీ ఎదుర్కొని తనకు చక్కని జీవితాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మోడీ ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పఢావో పథకానికి ‘పరివార్‌ బచావో' అన్న మరో పదాన్ని చేర్చాలని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లల పెంపకం మధ్య ఎటువంటి భేదాలు చూపకూడదని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆడపిల్లల విషయంలో తండ్రుల్లో ఎంతో మార్పొచ్చిందని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆడపిల్లల్ని చదివిస్తున్నారని, ఇది మంచి విషయమని హర్షం వ్యక్తం చేశారు.


0 comments:

Post a Comment