CSS Drop Down Menu

Wednesday, March 18, 2015

"కుమార్తె కోసం అద్దె తల్లిగా మారిన కన్నతల్లి" !


నేటి ఆధునిక వైద్య ప్రపంచంలో గర్భసంచి లేని యువతికి, మరో మహిళ గర్భసంచిని అద్దెకు తీసుకుని బిడ్డను కని ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ యువతి కోసం ఆమె కన్నతల్లే, అద్దె తల్లిగా మారి తన కుమార్తె కోసం నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించి ఇచ్చిన సంఘటన ఇటీవల చెన్నైలో చోటుచేసుకుంది. 
 
వైద్యుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన 27 ఏళ్ల యువతి వివాహమైన ఏడాదిలోనే గర్భం దాల్చింది. అయితే ఆమె ఏడో నెల గర్భవతిగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు వచ్చి రక్తస్రావమై అనుకోనివిధంగా బిడ్డ కడుపులోనే చనిపోయింది. 
 
ఆ తర్వాత వైద్యులు శస్త్రచికిత్స చేసి, బిడ్డను బయటకు తీసినా, గర్భసంచి పెద్దదిగానే ఉండటంతో ఆమెకు ప్రాణాపాయం ఉంటుందని దానిని తొలగించేశారు. దీంతో ఆ యువతికి బిడ్డ దక్కకపోగా గర్భసంచి లేకపోవడంతో తిరిగి పిల్లలు పుట్టే అవకాశం లేక కుమిలిపోయింది. దీంతో ఆమెకు అద్దె తల్లి ద్వారా బిడ్డను పొందవచ్చని వైద్యులు సూచించారు.
 
ఆ తర్వాత 2013లో ఆ యువతిని, ఆమె భర్తను పరీక్షించిన వైద్యులు అద్దె తల్లికోసం విచారించగా దాని కోసం ఎవరూ ముందుకు రాలేదు. తన కుమార్తె పడుతున్న ఆవేదనను చూసి ఆ యువతి కన్నతల్లి (61 ఏళ్లు) అద్దె తల్లిగా మారేందుకు అంగీకరించింది. ఆమె ముగ్గురు పిల్లలను కని, బయిస్టు ఆగిపోయి ఐదేళ్లు అయినట్లు తెలిపింది. 
 
ఐతే తన కన్నబిడ్డ కోసం, తానే మరోసారి అద్దెతల్లిగా మారి బిడ్డను ప్రసవించేందుకు ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆ యువతి నుంచి అండాలను, ఆమె భర్త నుంచి వీర్యాన్ని సేకరించి వృద్ధ తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. ఆమెను తొమ్మిది నెలలపాటు వైద్య పర్యవేక్షణలో ఉంచిన పిమ్మట ఆమెకు ఇటీవల 2.7 కిలోల బరువుతో పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఈవిధంగా తల్లే కుమార్తెకు మరో బిడ్డను కని ఇవ్వడం ప్రపంచంలోనే ఇది రెండోసారి అని వైద్యులు చెపుతున్నారు.
 
ఈ విధంగా తొలిసారిగా లండన్‌లో జరిగింది. అయితే అప్పుడు వృద్ధ తల్లి గర్భసంచిని అవయవ మార్పిడి ద్వారా తల్లి కడుపులో పెట్టారు. తద్వారా ఆమె ప్రకృతి సహజంగానే భర్తతో సంయోగం చెంది, బిడ్డను ప్రసవించింది.

0 comments:

Post a Comment