CSS Drop Down Menu

Saturday, November 8, 2014

జయమాలిని గురుంచి...


ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకుల గుండె ఝల్లుమనాల్సిందే..ఆమె హొయలొలికిస్తూ నృత్యం చేస్తే.. ప్రేక్షకుడి మది ఊహల్లో తేలియాడాల్సిందే.. ఇలా దశాబ్దానికి పైగా కుర్రకారును ఉర్రూతలూగించిన నటి జయమాలిని. 90వ దశకం ప్రథమార్థంలో సినీరంగానికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో భర్తపిల్లలతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు ఆరువందలకి పైగా చిత్రాల్లో నటించిన ఈ ‘జగన్మోహిని’ ఈ మద్య సంతోషం అవార్డ్స్ లో కనిపించి జిగేల్ అనిపించి కొన్ని స్టెప్స్ స్టేజి ఫై వేసి మరొక్కసారి పాతజ్ఞాపకలికి తీసుకెళ్ళింది.
. జయమాలినిగారు నమస్కారం. పత్రికల్లో, టీవీల్లో ఎక్కడా కనిపించడం లేదు. తెలుగు ప్రేక్షకులను మరిచిపోయారా?
తెలుగు ప్రేక్షకులను ఎలా మరిచిపోగలను చెప్పండి (నవ్వుతూ). నా సినిమాలన్నీ అక్కడే కదా!
. మీ అసలు పేరు జయమాలినేనా?
కాదు. నా అసలు పేరు అలమేలు మంగ. మా అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. అందుకే అలమేలుమంగ అన్న పేరు పెట్టింది. అయితే ఆ పేరు చాలా మొరటుగా ఉందన్న ఉద్దేశంతో వి
ఠలాచార్య గారు నాకు ‘జయమాలిని’ అని నామకరణం చేశారు. బహుశా నాకు ‘జయం’ కలగాలనే ఆ పేరు పెట్టినట్లున్నా రాయన.
. మీ జన్మస్థలమేది? మీ కుటుంబ నేపథ్యం..?
మా అమ్మ శాంభవిగారిది కాంచీపురం నాయుడుగారి కుటుంబం. మా నాన్నగారు టీకే రామరాజన్‌ గారిది తంజావూరు. మాది సినిమా నేపథ్య కుటుంబమే. నాన్న ‘వినాయక ప్రొడక్షన్స్‌’లో భాగస్వామి. మేం ఎనిమిది మంది సంతానం. ఐదుగురం ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ఎనిమిదిమందిలో పెద్దావిడ జ్యోతిలక్ష్మి, అందరికంటే నేను చిన్నదాన్ని. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే.
. సినిమా రంగంలోకి ఎలా వచ్చారు?
మా మేనత్త టీఆర్‌ రాజకుమారి 1940వ దశకంలో తమిళంలో అగ్రనటి. ఆమె ‘చంద్రలేఖ’, ‘హరిదాసు’ వంటి సినిమాల్లో నటించారు. తొలి తమిళ సినీ డ్రీమ్‌గాళ్‌ ఆమె. మా అంకుల్‌ టీఆర్‌ రామన్న ప్రముఖ దర్శకుడు. ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. లత, రవిచంద్రన్‌ హీరో హీరోయిన్లుగా ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ పేరుతో తమిళ సినిమా తీస్తుండగా ఓ రోజు టీఏ రామన్‌ మా అమ్మవద్దకు వచ్చారు. అందులో హీరోయిన్‌ స్నేహితురాలిగా ఓ పాత్ర వుందని, నన్ను అందులో నటింపజేస్తానని అమ్మని అడిగారు. అప్పటికి నా వయసు పన్నెండేళ్లు. అదే నా తొలిచిత్రం. ఆ సినిమా రిలీజైన తరువాత వి
ఠలాచార్య నా ఫోటోలను చూసి తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడదాని అదృష్టం’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చేయాలని అమ్మని అడిగారు. నేను చాలా పీలగా వుండడంతో పాటలో నటించేందుకు అమ్మ కొంత సందేహించింది. తర్జనభర్జనల తరువాత అమ్మ ఓకే చెప్పింది. అదే నా తొలి తెలుగు సినిమా.
. అంత చిన్న వయసులో వున్న మిమ్మల్ని ఐటమ్‌సాంగ్‌లో నటింపజేయాలని ఆయనకెందు కనిపించింది?
నేను భరతనాట్యం నేర్చుకుని వున్నాను. అప్పటికే అక్క జ్యోతిలక్ష్మి ఐటమ్‌సాంగ్స్‌లో నటిస్తోంది. ఆమెకు డ్యాన్స్‌ నేర్పేందుకు ఇంటికొచ్చిన గురువుల వద్దే నేను కూడా డ్యాన్స్‌ నేర్చుకున్నాను. చాలా చలాకీగా వుండేదాన్ని. ఆ సమయంలో మా ఇంటికొచ్చిన సీనియర్‌ దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌ నన్ను చూసి ‘ఈ అమ్మాయిని పెట్టి కూడా నేను సినిమా తీస్తా’ అన్నారు. అన్నట్లుగానే ఆ తరువాత ఆయన సినిమాల్లో నేను నటించాను. అలా నా చలాకీతనం, అందం, నృత్యం.. ఇవన్నీ గమనించే వి
ఠ లాచార్య నాకు అవకాశం కల్పించినట్లున్నారు.
. భరతనాట్యం సినిమాలకే పరిమితమైందా?
నేను చాలా బాగా డ్యాన్స్‌ చేస్తానని అప్పట్లో అందరూ మెచ్చుకునేవారు. నా భరతనాట్య అరంగేట్రం టి.నగర్‌, జీఎన్‌ చెట్టి రోడ్డులో వున్న వాణీమహల్లోనే జరిగింది. నాటి ముఖ్యమంత్రి ఎంజీఆర్‌, ప్రముఖ నటులైన కాంతారావు, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మాతృమూర్తి తదితరులెంతోమంది వచ్చారు. ఒక్క పాట చూసేందుకు వచ్చిన ఎంజీఆర్‌.. కార్యక్రమం చివరి వరకూ వుండి నా నృత్యాలన్నింటినీ వీక్షించారు. ‘అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే వారిని బాగా చూసుకోవాలి కూడా’ అని ఎంజీఆర్‌ నా అరంగేట్రం సందర్భంగా సూచించారు. నేనెప్పుడూ ఆయన మాటల్ని పక్కనబెట్టలేదు. చివరి వరకూ మా అమ్మ నా వద్దనే వుంది. సినిమాలు చేసేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పట్టణాల్లో అనేక చోట్ల నేను నృత్యం చేశాను. నా ప్రోగ్రామ్‌ అంటే జనం విరగబడి వచ్చేవారు. అప్పటికి సినిమాల్లో పెద్దగా పేరు రాకపోయినా నా డ్యాన్స్‌ కోసం జనం బారులు తీరేవారు. మా అమ్మ పేరుతో పెట్టిన ‘శాంభవి ఆర్ట్స్‌’ సంస్థ నేతృత్వంలోనే ఈ డ్యాన్స్‌ పోగ్రామ్‌లు నడిచేవి.
. మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు?
సుమారు 600 సినిమాల వరకూ నటించాను. అప్పట్లో ఇంత జ్ఞానం లేదు. దాంతో సినిమాల జాబితా కూడా దగ్గర పెట్టుకోలేకపోయాను. అన్నీ అమ్మ చూసుకునేది కదా, ఆమెకేమో ఈ పరిజ్ఞానం తెలియదు.
. ఏ భాషలో ఎక్కువ చేశారు?
తెలుగులోనే. తెలుగు పరిశ్రమే నన్ను బాగా ఆదరించింది. తెలుగు ప్రేక్షకుల కారణంగానే నేనీ స్థాయిలో వుండగలిగాను.
. వ్యాంప్‌ పాత్రలకే ఎందుకు పరిమితమయ్యారు?
అప్పటికే మా అక్క వ్యాంప్‌ పాత్రల్లో నటిస్తోంది. జ్యోతిలక్ష్మి చెల్లెలన్న భావనతో నాకు అలాంటి పాత్రల్నే నిర్మాతలు ఇచ్చారు. తెలుగులో ‘జగన్మోహిని’, ‘మదనమోహిని’, తమిళంలో ‘కరాటే కమల’ వంటి సినిమాల్లో మంచి ప్రాధాన్యమున్న పాత్రలు చేశాను. కానీ ఎందుకో ఆ తరువాత కూడా వ్యాంప్‌ పాత్రలే వచ్చాయి మరి. అక్కను చిన్నతనంలోనే మా మేనత్తగారికి దత్తత ఇవ్వడంతో కుటుంబ బాధ్యత అమ్మపై పడింది. దాంతో నేను ఆమెకు సపోర్టుగా వుండాల్సి వచ్చింది. అందుకే ఎలాంటి పాత్రలు వచ్చినా చేయక తప్పలేదు.
. అందంలో, నటనలో, ప్రతిభలో మిగిలిన హీరోయిన్ల కన్నా తక్కువ కాకపోయినా.. మీకు హీరోయిన్‌గా అవకాశాలు రాలేదని బాధపడలేదా?
చిన్నప్పుడు పెద్దగా అనిపించలేదు. ఊహ తెలియడం మొదలుపెట్టాక హీరోయిన్‌ కాలేకపోయానే అని మనసు బాధపడేది. దాసరి నారాయణరావు గారు లాంటివారు ‘ఈ పాత్రలు ఆ అమ్మాయికి తగినవి కావు’ అని చెప్పినప్పుడల్లా మరింత బాధేసేది. హీరోయిన్‌ అయ్యేందుకు ప్రయత్నించాను. కానీ అప్పటికే ఐటమ్‌సాంగ్స్‌లో పడిపోయాను. చివరి వరకూ అదే కొనసాగింది.
. ఎవరితో నటించడం కంఫర్టబుల్‌గా అనిపించేది?
నాకెవ్వరితోనూ కంఫర్ట్‌గా లేదు. అలాగని ఎవ్వరితోనూ ఇబ్బందీ లేదు. నేను ఇప్పుడే బాగా మాట్లాడుతున్నాను. సినిమాల్లో నటించేటప్పుడు ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. సెట్‌లో కామ్‌గా కూర్చొనేదాన్ని, షూటింగ్‌ అయిన వెంటనే ఇంటికెళ్లిపోయేదాన్ని. ఎన్‌టీఆర్‌ గారితో ఎక్కువ సినిమాలు చేశాను. అలాగే చిరంజీవి, శోభన్‌బాబు గారితో కూడా. వారంతా సెట్‌లో సరదాగా వుండేవారు. అక్కినేనితో తక్కువ సినిమాలే చేశాను. సెట్‌లో ఆయన బాగా అల్లరి చేసేవారు. కృష్ణగారు నాలాగే పెద్దగా ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. నా పనేదో నేను చేసుకునేదాన్ని. అందువల్ల కంఫర్టబుల్‌ అన్నదాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు.
. సినీరంగంలో మీ స్నేహితులు?
చెప్పాను కదా, నేను మాట్లాడేది చాలా తక్కువని. అందుకే సినీపరిశ్రమలో నాకు స్నేహితులెవ్వరూ లేరు.
. మీ ఐటమ్‌సాంగ్‌ వల్లనే హిట్టయిన సినిమాలు చాలానే వున్నాయి. పారితోషికం కూడా ఆ స్థాయిలోనే వుండేదా?
ఎక్కడండీ, చాలా తక్కువే ఇచ్చేవారు. అప్పట్లో హీరోకే రూ.3 లక్షల పారితోషికం వుండేదేమో! ఇక హీరోయిన్‌కు దానికన్నా తక్కువే. ఐటమ్‌ సాంగ్‌కు తక్కువే వుండేది. ఎంత ఇస్తారో సరిగ్గా తెలియదు గానీ, రూ.20 వేలు వుంటుందని అనుకుంటున్నా. ఒకే సినిమా మూడు-నాలుగు భాషల్లో కూడాతీసేవారు. అప్పుడు మాత్రం భారీగా ఇచ్చేవారు. డబ్బు గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. అన్నీ అమ్మే చూసుకునేది. ‘యాక్షన్‌-పేకప్‌’ వరకే మన పని.
. కొన్నాళ్లు మీ అక్క జ్యోతిలక్ష్మికి మీరే పోటీ అయినట్లున్నారు?
లేదండీ. ఆమె నాకన్నా చాలా సీనియర్‌. ఆమె పదేళ్లకు పైగా సినిమాలు చేసిన తరువాత నేను అడుగుపెట్టాను. ఆమెతో నేనెక్కడ పోటీ పడగలను? అయితే నాకు హీరోయిన్‌ ఫేస్‌ వుందని అందరూ అనేవారు.
. ఎన్నేళ్లు సినీ పరిశ్రమలో ఉన్నారు?
పద్నాలుగేళ్లు ఉన్నాను. 11-12 ఏళ్లు మంచి పీక్‌ సీజన్‌. తరువాత ఓ మేరకు సినిమాలు చేశాను.
. పన్నెండేళ్లకే సినిమాల్లోకి అడుగు పెట్టిన మీరు… ఇరవయ్యారేళ్లకే పరిశ్రమకు బరువయ్యారా?
ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. నేను మొదట్లో చాలా సన్నగా ఉన్నానని చెప్పాను కదా! సినిమాల్లో నేను పెద్దదానిలా కనిపించడం కోసం అమ్మ ఏవేవో పదార్థాలు పెట్టేది. ప్రతిరోజూ పచ్చి కోడిగుడ్డు పగలగొట్టి నోట్లో పోసేది. దాంతో బాగా శరీరం పెరిగింది. అప్పట్లో ఇప్పటిలా శరీరం గురించి పెద్దగా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం కాదు. ఈనాటి జిమ్‌లు, శరీరం నాజూగ్గా ఉండేందుకు మందులు, ఫిట్‌నెస్‌ కోసం చిట్కాలు అప్పట్లో లేవు. సెట్‌లో కూడా ఏది పెడితే అది తినేవాళ్లం. ఇంట్లో మనసుకి నచ్చిందంతా లాగించేసేవాళ్లం. దాంతో శరీరం పెరిగింది.
. సినిమాలు తగ్గాయని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి కోసం సినిమాలు వదులుకున్నారా?
సినిమాలు తగ్గుతూ వచ్చిన తరువాతే పెళ్లికి దిగాను. అప్పటికే మా అన్నలు, అక్కల్లో ఒక్కొక్కరికి పెళ్లిళ్లు చేసింది అమ్మ. సినిమాలు చేస్తున్నప్పుడే మూడు నాలుగు సంబంధాలు వచ్చాయి. కానీ మధ్యలో సినిమాలు మానేస్తే కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందని అమ్మ వద్దనడంతో కొంతకాలం ఆగాను.
. సినిమావాళ్ల నుంచి ప్రపోజల్స్‌ రాలేదా?
మధ్యలో వచ్చిన పెళ్లి సంబంధాలు సినిమావాళ్ల నుంచే. పేర్లు వద్దులెండి. కానీ నా కుటుం బం కోసం ఆ సంబంధాలు వద్దనుకున్నాను.
. మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?
పెద్దలు కుదిర్చిన పెళ్లే. మా అన్నయ్య స్నేహితుడే మావారు. ఆయన పేరు పార్తీబన్‌. మా ఇద్దరి నివాసాలు అప్పట్లో పక్కపక్కనే ఉండేవి. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేసినా నిజజీవితంలో నా నడవడిక, నా తీరుతెన్నులు చూసి మా అత్తగారే నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చారు. మా వారికి కూడా నా గురించి అంతా తెలుసు. నా అన్నేళ్ల సినిమా జీవితంలో నాపై ఒక్క రూమర్‌ కూడా లేదు. నా పనేదో నేను చేసుకుంటూ పోయానే తప్ప ఏనాడూ హద్దులు దాటలేదు. అల్లు రామలింగయ్యగారు ఎప్పుడూ చెబుతుండేవారు – ‘రెడీ యాక్షన్‌ అంటేనే జయమాలిని నవ్వుతుంది. పేకప్‌ చెప్పాక ఒక్క క్షణం కూడా సెట్‌లో ఉండదు’ అని. వృత్తిని వృత్తిగానే చూశాను. అంతే! నేను సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్‌ చేసినా నా క్రమశిక్షణ, వ్యక్తిత్వం బాగా తెలుసుగనుకే మా వారు నన్ను చేసుకున్నారు. మా పెళ్లి 1994 జూలై 19వ తేదీన తిరుమలలో జరిగింది.
. పెళ్లి తరువాత సినిమాలవైపు రాలేదెందుకని?
నేనే వద్దని అనుకున్నాను.
. ఎందుకు వద్దనుకున్నారు?
పెళ్లి ముచ్చట తీరేసరికి బాబు పుట్టాడు. అతని ఆలనాపాలనా చూసేసరికి సగం కాలం గడిచిపోయింది. ఆ తరువాత కుటుంబానికి అలవాటుపడిపోయాను.
. సినిమాల్లోకి రావద్దని మీవారు ఏమైనా కండీషన్‌ పెట్టారా?
అయ్యయ్యో! అలాంటివేమీలేదు. ఆయన ఎప్పుడూ సినిమాలు వద్దని చెప్పలేదు. పెళ్లికి ముందు దీని గురించి ప్రస్తావనే రాలేదు. తరువాత నా ఇష్టానికే వదిలేశారు.
. ఫ్యామిలీ లైఫ్‌ ఎలా ఉంది?
బ్రహ్మాండంగా ఉంది. మా పెళ్లయ్యేనాటికి మా వారు తమిళనాడు పోలీస్‌శాఖలో ఎస్సైగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మా ఆయన మనసు బంగారం. నన్ను అర్థం చేసుకున్న భాగస్వామి దొరకడం నా అదృష్టం. మాకు ఒక బాబు. . ఇంతకు మించి వివరాలు వద్దులెండి.
. మళ్లీ సినిమాల్లోగానీ, టీవీ సీరియళ్లలోగానీ నటించే ఉద్దేశం ఉందా?
చేయాలని మనసు కోరుకుంటోంది. మంచి క్యారెక్టర్‌ దొరికితే చేస్తా. అది కూడా బాబు కాలేజీ చదువు పూర్తయ్యాకే. అంతా భగవంతుడి దయ.
. జీవితంలో బాగా సంతోషకరమైన సంఘటన?
మా అబ్బాయి పుట్టడమే. అంతకన్నా సంతోషకరమేముంది?
. బాధాకరమైన సంఘటన?
మా అమ్మ చనిపోవడం.
. తీరని కోరిక ఏమైనా ఉందా?
ఎంజీఆర్‌తో నటించలేకపోయాను. ఎంజీఆర్‌ హీరోగా ‘అన్నా! నీ ఎన్‌ దైవం’ అనే సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అందులో నాకొక పాత్ర ఇచ్చారు. కానీ అంతలోనే ఆయన సీఎం కావడంతో ఆ సినిమా అలానే ఉండిపోయింది. నా భరతనాట్య అరంగేట్రం ఆయనతోనే జరిగినా.. ఆయనతో కలిసి సినిమాలో నటించలేకపోవడం మాత్రం కొరతే.
. మీరు జీవితచరిత్ర రాయాలనుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది?
అలాంటిదేమీ లేదు. ఇలాంటి ప్రచారాలు నేను కూడా చాలా విన్నాను. నేను అమెరికా వెళ్లిపోయానని, ఇంకెక్కడెక్కడో ఉంటున్నానని, నేను చెప్పినట్లు కూడా ఏవేవో వారే ఊహించి రాసేశారు. నేను చెన్నైలోనే ఉన్నాను.
. మీరు బయటికొచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి ఇప్పటికీ స్పందన ఉంటోందా?
ఎందుకు లేదు? జనాలు మరచిపోతే కదా స్పందన కరువవ్వడానికి! అప్పట్లో నేను, శ్రీదేవి, జయసుధ ఎప్పుడైనా బయటికెళ్లాలంటే బురఖా వేసుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడంత లేదు. నేను మొదటి నుంచీ సినిమా ఫంక్షన్లకు వెళ్లడం కూడా తక్కువే. ఇప్పటికీ అంతే, బయటికి ఎక్కువగా వెళ్లను. ఇంట్లోనే మా మేనత్త కట్టించిన ఆలయం ఉంది. ఎప్పుడైనా అరుదుగా బయటి ఆలయాలకు వెళ్తాను. అప్పుడెవరైనా గుర్తు పట్టి పలుకరిస్తుంటారు, కొంతమంది ఫోటోలు కూడా తీసుకుంటుంటారు.

0 comments:

Post a Comment