CSS Drop Down Menu

Tuesday, April 1, 2014

డబ్బు తీసుకోవడం తప్పా ?ఒప్పా ?? మీరే చెప్పండి ???

            మొన్న మున్సిపల్ ఎలక్షన్లు జరిగిన ఓపట్టణంలో ప్రజలంతా క్షమించండి ఓటర్లంతా జయనామ సంవత్సరం ఒకరోజు ముందుగానే వాళ్ళందరికి ఆనందం కలిగించిందని ఎంతో సంతోషంగా ఉన్నారు.కారణం ఏమిటని? ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అక్కడ పోటీ చేస్తున్న రెండు రాజకీయపార్టీలు ఒక్కొక్క ఓటుకు 3000/- నిజమండి అక్షరాల మూడువేల రూపాయలు అంటే ఒక ఓటుకు 6000/-(ఆరువేల రూపాయలు) ఇచ్చేసరికి వాళ్ళ ఆనందానికి అవదులు లేకుండా పోయింది.ఇది తెలిసిన బయట జనాలు అరే మనక్కూడా అక్కడ ఓటుంటే ఎంత బాగుండునని మనసులో భాదపడి పైకిమాత్రం నవ్వుకుంటూ వేలాకోళాలు ఆడుకొన్నారనుకోండి అదివేరే సంగతి. 

             ఇక అసలు విషయానికొస్తే ఒక పెద్దాయన్ని “డబ్బులు తీసుకోని ఓటు వెయ్యడం తప్పు కదా? వాళ్ళు డబ్బులు పంచేటప్పుడు మాకొద్దని?చెప్పొచ్చు కదా!” అనంటే దానికి ఆ పెద్దాయన ఆ మాత్రం మాకు తెలియదా అన్నట్టు నావంక చూచి “మనం వద్దంటే సరేనని బయటకి వెళ్ళాక లిస్టులో మనకి ఇచ్చినట్లు సున్నా చుట్టి ఆడబ్బులు వాళ్ళ జేబుల్లోకి పోతాయి. మనం తీసుకోక పోయినా వాళ్ళ దృష్టిలో తీసుకొన్నట్లే. ఒక్కొక్కసారి వీళ్ళు వాళ్ళ నాయకునితో మనం డబ్బులు ఇస్తుంటే వద్దంటున్నారు అంటే వీళ్ళు మనకు ఓటేయకుండా ప్రత్యర్ధిపార్టీ వాళ్ళకే వేస్తారంటు వాళ్ళ నాయకునికి మనమీద లేనిపోని పితూరీలు చెప్పడంతో మనపై కక్ష పెంచుకుంటారు. ఇది వరకు ఇలా వద్దన్న వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు.  అందుకే డబ్బులు తీసుకొని వాటిని ఏ పుణ్యకార్యానికో ఖర్చు పెట్టేయడమే.ఇక ఓటు అంటారా మనకు నచ్చిన వారికి ఎలాగు వేస్తాం!ఓటుకు నోటు అనేది కామన్ అయిపోయింది ఈకాలంలో మరి భవిష్యత్తులో ఎలా? ఉంటుందో కాలమే నిర్ణయించాలి” అనే సరికి ఈయన చెప్పింది నిజమేననిపించింది.

                     తర్వాత కూలీల దగ్గరకు వెళ్ళి అడిగితే “ఏమిటండి ఏమి తెలియనట్లు మమ్మల్ని అడుగుతారు మేమేమి వాళ్ళని అడగలేదు కదా వాళ్ళే ఇంటింటికి తెచ్చి ఇచ్చారు.నిజంగా చెబుతున్నా మాఇంట్లో నాలుగు ఓట్లున్నాయి. మాకు 24000 రూపాయలు ఇచ్చారు. దాంతో నా అప్పు మొత్తం తీరిపోయింది. ఈ ఎలక్షన్ల పుణ్యమా అని మాలాంటోళ్ళ చాలా మంది  అప్పులు తీరిపోయాయి.అవసరానికి 1000 రూపాయలు కాదు కదా కనీసం 100 రూపాయలు అప్పుగా ఇమ్మన్నా బయటకు పొమ్మంటారు. ఇలాంటప్పుడే మాలాంటోళ్లు వాళ్ళకి అవసరం. ఎలక్షన్లు అయిపోయాక మళ్ళి ఎలక్షన్లు దాక మా మొఖం చూడమన్నాచూడరు” అనేసరికి వాళ్ళు చెప్పింది సబబుగానే అనిపించింది.


             ఇక ఓటున్న విద్యార్ధుల సంతోషానికి అవదుల్లేవు వచ్చిన డబ్బులతో సెల్ ఫోన్ కొనుక్కోవాలని కొందరు, బట్టలు, షూస్ కొనాలని కొందరు అనుకొంటున్నప్పుడు వాళ్ళతో “చదువుకోనివారంటే అనుకోవచ్చు, చదువుకుంటున్న మీరు కూడా ఇలా ఓట్లకి డబ్బులు తీసుకొవడం తప్పు కదా? అంటే ఏంటి? సార్! మీరు కూడా వీళ్ళంతా నీతి, నిజాయితీగా గవర్నమెంటుకు టాక్సులు కట్టి సంపాదించిన డబ్బేమి కాదుకదా! అంతా నల్లదనమే కదా! కనీసం ఈ రకంగానైనా జనాలకి పంచనివ్వండి. ఎలక్షన్లు లేని రోజులలోవీళ్ళంతా ఏ ఒక్కరి కైనా సాయం చేస్తారా? చెప్పండి.మొన్న టివీన్యూస్ లో వినలేదా?  ఈ ఎలక్షన్లలో పెట్రోలు,బట్టలు,గిప్ట్స్ వంటి వాటిపై ఖర్చుపెట్టే నల్లధనంతో గవర్నమెంటుకు 50,000 కోట్ల రూపాయలు టాక్సురూపంలో ఆదాయం వస్తుందట. అలాంటప్పుడు గవర్నమెంటు ఎలక్షన్ల టైములో ధనప్రవాహాన్ని అడ్డుకొనేందుకు చెక్కింగులు ఏర్పాటు చెయ్యడం ఎందుకు? దండగ? మీరే చెప్పండి? పోనీ నిజాయతీగా ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశ్యంతో ఎవరైనా మంచివాడు ఏదైనా పార్టీ తరపున నిలబడడానికి వెళ్తే పార్టీలు అభ్యర్ధి గుణగణాలు కాకుండా ధనవంతుడా? కాదా? అనేవే చూస్తున్నాయి.ఇలాంటి పార్టీలున్నంత కాలం ఇలాంటివి తప్పవు సార్! అనే సరికి వాళ్ళకి ఏం? చెప్పాలా! అని ఆలోచిస్తుంటే వాళ్ళు నన్ను చూసి నవ్వుకొని బస్సు వచ్చేసరికి ఎక్కి వెళ్ళిపోయారు.


         మీరే చెప్పండి? పెద్దాయన చెప్పింది కరక్టా?? కూలీల చెప్పిందికరక్టా??? విద్యార్ధుల చెప్పింది కరక్టా????
     

0 comments:

Post a Comment